ఒక మామూలు హీరోలా పరిచయమై, ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజానీకానికి ఆరాధ్య సినీ నాయకుడిగా మారిపోయాడు ప్రభాస్. 'బాహుబలి' సినిమాలు రెండూ తెచ్చిన అమేయమైన ఇమేజ్‌తో ఇవాళ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి అత్యంత క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. 2002లో జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేసిన 'ఈశ్వర్' మూవీతో కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణరాజు తనయుడైన ప్రభాస్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ మూవీలో మంజుల కుమార్తె శ్రీదేవి హీరోయిన్.
బాక్సాఫీస్ దగ్గర 'ఈశ్వర్' యావరేజ్‌గా ఆడింది. అయితే హ్యాండ్సమ్‌నెస్, ఎనర్జీతో భవిష్యత్తులో హీరోగా నిలదొక్కుకుంటాడు అనిపించుకున్నాడు ప్రభాస్. ఆ సినిమాలో నటించినందుకు అతనికి ప్రొడ్యూసర్ కె. అశోక్‌కుమార్ ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం వెల్లడించాడు ప్రభాస్. "ఆ సినిమాకు నా పారితోషికం 5 లక్షలు. దాన్ని ఏం చేశానో గుర్తులేదు." అని చెప్పాడు.
హీరో కాకుండా ఉంటే ప్రభాస్ ఏమయ్యేవాడు? "అసలు నేను హీరో అవుదామని అనుకోలేదు. హీరో కాకుండా ఉంటే కచ్చితంగా బిజినెస్ చేద్దామనుకున్నా. ఫలానా బిజినెస్ చేయాలని మాత్రం అనుకోలేదు." అనేది అతడి సమాధానం. జయాపజయాలు అతడిపై ప్రభావం చూపుతుంటాయి. "ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తప్పకుండా బాధపడతా. నా వల్ల ఫెయిల్ కాకూడదని అనుకుంటా. చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతా." అని తెలిపాడు ప్రభాస్.